శీలం – పవిత్రత
జరుగుతున్న అత్యాచారాల్లో ఎన్నో సమాజం, చట్టం దృష్టికి రాకపోవడానికి, మరియు నేరస్తుడికి నేరం చేయడానికి సహకరిస్తున్నదీ సమాజంలో శీలం పట్ల వున్న భావన!
శీలం మనసుకు సంభందించింది అయ్యుండాలే గానీ శారీరకం అవకూడదు. ఒక చేయీ, చేయీ కలిస్తే ఎంతనో, పెదవీ, పెదవీ కలిస్తే ఎంతనో జననాంగాలు కలిసినా (పరస్పరాంగీకరం లేకుండా) దానికి అంతకు మించి ప్రాధాన్యత ఇవ్వకూడదు. శీలానికి ఎటువంటి పవిత్రతా లేదు.
శీలానికి పవిత్రతను ఆపాదించడం వల్ల బోలెడన్ని అనర్థాలు జరుగుతున్నాయి. దానికి విపరీతమైన పవిత్రతనూ, దైవత్వాన్ని ఆపాదించడం వల్లనే దాన్ని కోల్పోయామనుకున్న వారు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు, కోర్టుల్లో ధైర్యంగా వాదించడానికి జంకుతున్నారు. చివరికి తల్లిదండ్రులూ దీనికారణంగానే మౌనంగా బాధను దిగమింగుతున్నారు. దీనివల్లే తప్పు స్త్రీది కాని పక్షంలో కూడా పెళ్ళిళ్ళు విక్షిన్నమవుతున్నాయి, స్వంత కుటుంబంలోనే స్త్రీ చిన్నచూపు చూడబడుతోంది. ఒకడు దొంగతనం చేస్తూ పట్టుబడితే దొంగతనం చేసినవాడే సమాజం వల్ల శిక్షార్హుడౌతున్నాడు. కానీ శీలం దొంగలిస్తే మాత్రం దొంగ కాకుండా బాధితురాలే మళ్ళీ సమాజం వల్ల శిక్షింపబడుతోంది. శీలం పోయిందని సమాజంచే వెలివేయబడతాననే భయం చేతనే స్త్రీ తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి, బయటపెట్టడానికీ భయపడుతోంది. స్త్రీ యొక్క ఈ బలహీనతే మగాడికి వరంగా మారుతోంది. తప్పు చేసినా, తనపై తెగబడినా బయటకు రాదనే భరోసాతోనే బయటకు సాధారణ పురుషుడుగా కనపడే తాత, తండ్రి, మావయ్య లాంటి దగ్గరి రక్త సంబందీకులు కూడా ఎవరూ చూడని చోట అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
మన సమాజం దృడమైనది, ఎంతో సభ్యతా సంస్కారాలున్నది అని జబ్బలు చరచుకోవడం వల్ల వుపయోగం లేదు. ఈ సభ్యతల ముసుగు వల్లే, పరువు, ప్రతిష్టలనే దేవతా వస్త్రాలవల్లే నేరాలు జరగడానికి ఎక్కువ ఆస్కారం వుంది. ఒక్కసారి శీలహరణం కూడ దొంగతనం లాంటిదే అని ఆలోచించిచూడండి. దొంగతనం చేయడానికి సామాన్యుడు ఎలా భయపడతాడో, అత్యాచారం చేయడానికీ అలానే భయపడతాడు. ఎప్పుడైతే శీలానికి ప్రాధాన్యత లేదో అప్పుడు స్త్రీ నిర్భయంగా తనకు జరిగిన అన్యాయాన్ని సమాజం ముందు పెట్టి ముసుగులో నేరస్తున్ని బయటకు రప్పిస్తుంది. శీలానికి ఎప్పుడు ప్రాధాన్యత లేదో అప్పుడు దొంగచాటుగా సెల్‌పోన్‌లో స్త్రీల రహస్య భాగాలని చిత్రించి వాటితోనే వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి మరింత హింసించడం మాయమవుతుంది.
అయితే శీలం పట్ల మనలో పాతుకుపోయిన ఈ భావం క్షణంలో మారేది కాదు. పిల్లలని పెంచే దగ్గరనుండీ, సాహిత్య సృష్టి వరకూ మన భావజాలం మారాల్సి వుంది. పాత సినిమా నుండీ ఈ నాటి సినిమా వరకూ విలన్, హీరోయిన్ బట్టలు చించినా, జుట్టు పట్టి లాగినా … ఎన్ని చేసినా ఆ ఒక్కటి జరగక పోతే మాత్రం ప్రేక్షకుడు “హమ్మయ్య” అనుకుని ఊపిరి పీల్చుకుంటాడు.
ఈ ధోరణి మారాలి.










(3 ఓట్లు, సగటు: 5 కు 4.67)
(2 ఓట్లు, సగటు: 5 కు 3.50)